కిల్లాడ సత్యనారాయణ గారు వ్రాసిన మాట - మౌనం అనే వ్యాసం ఈనెల మిసిమి మాసపత్రిక లో చదివాను. నాకు ఎంతగానో నచ్చింది.. అందుకని ఆర్టికిల్ లోని కొన్ని వాక్యాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.......
మాట - మౌనం
మనిషి ఎంత ముఖ్యమో మాట అంతే ముఖ్యం.. మాటంటే జీవి అంతరంగపు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రం. మాటంటే అగాధ జలనిధిలో నుంచి పిలుస్తున్న ఆణిముత్యం. మాటంటే పలుకుల గర్భం లోపల వెలుగుతున్న శిశువు.
కొందరి మాటలు మంత్రాల్లా ముగ్ధుల్ని చేస్తాయి. మరి కొందరి మాటలు మెడచుట్టూ బిగుసుకుంటాయి.
కొందరి మాటలు లేపనాలు. మనసుపై మొలిచిన వ్రణాన్ని వెంటనే మాన్పుతాయి. మరి కొందరి మాటలు ఈటెలు. గుండెను నిలువునా చేరుస్తాయి.
కొందరి మాటలు దొరసానులు. మరి కొందరి మాటలు మంత్రగత్తెలు. కొందరి మాటలు ఉరుములు. మరి కొందరి మాటలు ఇంద్రధనస్సులు. కొందరి మాటలు మేఘాలు. మరి కొందరి మాటలు వర్షాలు.
కొన్ని మాటలు లేడి పిల్లలు..వాటికి లేచిందే పరుగు. కొన్ని మాటలు ఐరావతాలు దేనికి తొందర పడవు.
కొన్నిసార్లు మనసుని చంపి మాటలు బయటకు వస్తాయి లేదా మనసును చంపడానికి బయటకు వస్తాయి.
అక్షరాలు కలలు కంటాయి మాటలు గా మారాలని.. ఆ మాట మధురమై పది మంది మదిలో వెలిగినప్పుడు వాటి జన్మ ధన్యమైంద నుకుంటాయి.
మాటను ఒడిసి పట్టుకొని ఇతరులకు ఇచ్చేటప్పుడు తూకం వేసి ఇవ్వు ..ఇవ్వకున్నా పర్వాలేదు, అక్కర లేని వాళ్లకు అసలు ఇవ్వకు. అవసరానికి మించి అస్సలు ధారపొయ్యకు.